ఒక అడవిలో నక్క ఒకటి నివసిస్తుంది. ఒకరోజు అది ఎంత వేటాడినా ఆహారం దొరకలేదు. ఆకలితో అది బాధపడుతుంది. ఆకలి బాధను తీర్చుకోవడానికి ఏదో ఒకటి తినాలని వెతకసాగింది. ఎంత వెతికిన దానికి ఆహరం లభించలేదు. అంతలో దానికి ఒక ద్రాక్ష తోట కనిపించింది. అప్పటి వరకు నక్క ఆ ద్రాక్ష తోటను ఎన్నడూ చూడలేదు. అక్కడి వాతావరణం దానికి బాగా నచ్చింది. ఆ ద్రాక్షపళ్ళు చాలా ఎత్తుగా ఉండటంతో నక్కకు అందలేదు. ఆకలితో ఉన్న ఆ నక్కకు ద్రాక్షపళ్ళను చూడగానే తినేయాలనుకుంది. ఎలాగైనా వాటిని తినాలని పైకి ఎగిరి ప్రయత్నించింది, కానీ అవి అందలేదు, తిరిగి ప్రయత్నించింది. అలా చాలాసార్లు ఎగిరినప్పటికీ ద్రాక్షపళ్ళు అందక పోవడంతో నిరాశ చెందింది. పట్టు వదలకుండా మళ్ళీమళ్ళీ ప్రయత్నించినప్పటికీ విఫలమైంది. నక్కకు అందనంత ఎత్తులో ద్రాక్షపళ్ళు ఉన్నాయి. ఎన్నో రకాలుగా ప్రయత్నించిన నక్క అలసిపోయింది. దాని శరీరంలోని శక్తి అంతా నశించింది. దాంతో ద్రాక్షపళ్ళ కోసం ఎగిరే ప్రయత్నాన్ని విరమించుకుంది. అయితే ద్రాక్షపళ్ళు తినాలనే దాని ఆశ మాత్రం చావలేదు.
నిరాశగా వెనుతిరిగిన నక్క తనను తాను ఓదార్చు కుంటూ “ఈ ద్రాక్షపళ్ళు చాలా పుల్లగా ఉంటాయి, అందుకే అందలేదు. ఇకపై వాటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు” అని తనను తాను సమర్థించుకుంది.
MORAL : మనకు అందని దాన్ని గురించి చెడుగా చెప్పడం చాలా సులభం.
తీరిన కాకి దాహం Small Telugu moral stories
అది మండు వేసవి కావడంతో విపరీతమైన ఎండ, వేడి వల్ల ఒక కాకికి విపరీతంగా దాహం వేసింది. దానికి ఎక్కడా నీరు దొరకలేదు. చెరువులు, బావులు, కాలువలు ఎండిపోయాయి. ఎక్కడెక్కడో కాకి తిరిగినప్పటికీ దానికి నీళ్ళు దొరకలేదు. నాలుక, గొంతు తడి ఆరిపోయింది. ఏం చేయాలో కాకికి పాలుపోలేదు. నీటి కోసం వెతుకుతున్న కాకికి ఒక కుండ కనిపించింది. అందులో నీళ్ళు ఉంటాయేమో అని కాకి ఆశగా ఆ కుండపై వాలి లోపలికి తొంగి చూసింది. ఆ కుండలో ఎక్కడో అట్టడుగున కొన్ని నీళ్ళు కనిపించాయి. ఆ నీటిని తాగడానికి కాకి చాలా ప్రయత్నించింది. నీరు అడుగున ఉండటం వల్ల దానికి అందలేదు. దాహంతో అల్లాడుతున్న ఆ కాకికి నీరు కనిపించినప్పటికీ తాగులేకపోతున్నందుకు బాధపడింది. అటూ ఇటూ చూసింది, కుండకు సమీపాన కాకికి గులకరాళ్ళు కనిపించాయి. వెంటనే కాకికి ఒక ఉపాయం తట్టింది. ఒక్కోరాయిని పట్టుకొని వచ్చి ఆ కుండలో మెల్లగా జారవిడిచింది. ఆ రాళ్ళన్నీ నీటి అడుగు భాగానికి చేరాయి. రాళ్ళు పెరిగిన కొద్దీ నీరు పైకి వచ్చింది. అలా నీళ్ళు పైకి వచ్చే వరకు కాకి గులకరాళ్ళను కుండలో వేసింది. కొద్దిసేపటికి కుండలోని నీళ్ళు పైకి వచ్చాయి. కాకి ఆ నీటిని తాగి తన దాహం తీర్చుకుని ఆనందంగా ఎగిరిపోయింది.
MORAL : ఎటువంటి అపాయాన్నైనా ఉపాయంతో తప్పించుకోవచ్చు. సమస్యలు వచ్చినప్పుడు మనం సహనంగా ఉండి కష్టపడి పనిచేసినట్లయితే పరిష్కార మార్గం లభిస్తుంది.
కుందేలుకు గర్వభంగం Small Telugu moral stories
ఒక అడవిలో కుందేలు, తాబేలు నివసిస్తున్నాయి. తాబేలు అక్కడే ఉన్న చెరువులో నివసిస్తుంటే, కుందేలు దాని ఒడ్డునే ఉండేది. దాహం తీర్చుకోవడానికి కుందేలు ఆ చెరువులోకి వచ్చేది. ఆ సమయంలో తాబేలు నడకను చూసి కుందేలు వెక్కిరించేది. కుందేలు శరవేగంతో పరుగులు తీసేది, తాబేలు మెల్లిగా నడిచేది. ఇది చూసి కుందేలు ఎప్పుడూ హేళనగా మాట్లాడింది. తనలా ఎవరూ పరుగులు తీయలేరని, తానే ఎంతో గొప్పదాన్నని కుందేలు గర్వపడేది. ఒకరోజు కుందేలు తాబేలు వద్దకు వెళ్ళింది. “మిత్రమా! మనిద్దరం పరుగుపందాలు పెట్టుకుందామా? నాతో నువ్వు పరుగు పందెంలో గెలవలేవు” అంటూ కుందేలు సవాలు విసిరింది. అందుకు తాబేలు అంగీకరించింది. సమీపాన ఉన్న కొండ వరకు పరుగెత్తాలని లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాయి. పరుగు పందెం మొదలయ్యింది. ఈ వింతను చూడటానికి అడవిలోని జంతువులన్నీ వచ్చాయి. “సరిగా నడవలేని తాబేలు, శరవేగంతో పరుగులు తీసే కుందేలుకు పరుగు పందెం ఏమిటి?” అని వింతగా చెప్పుకున్నారు. పరుగు పందెం మొదలైంది, కుందేలు దూసుకుని వెళ్ళసాగింది. తాబేలు మెల్లిగా నడవసాగింది. కుందేలు చాలా దూరం పరుగెత్తి వెనక్కు తిరిగి చూసింది. కనుచూపుమేరలో తాబేలు కనపడలేదు. “ఈ తాబేలు నాతో పోటీ పడి ఎప్పటికి నెగ్గేను?” అనుకున్నది. అక్కడ కుందేలుకు కొన్ని ఫలాలు కనపడినాయి, కుందేలు వాటిని ఆరగించింది. ఈ తాబేలు ఇప్పట్లో రాదులే అని భావించిన కుందేలు చెట్టు నీడన కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంది. మెల్లిగా అది నిద్రలోకి జారుకుని హాయిగా నిద్ర పోయింది.
తాబేలు మెల్లిగా నడచుకుంటూ తన గమ్యాన్ని చేరింది. నిద్ర నుండి మేల్కొన్న కుందేలు ఎంతో వేగంగా పరుగెత్తి తాము అనుకున్న గమ్యస్థానానికి చేరింది. పరుగు పోటీలలో విజేతగా నిలిచినందుకు తాబేలును అడవిలోని జంతువులన్నీ అభినందించాయి. తనకంటే ముందుగానే అక్కడికి చేరుకున్న తాబేలును చూసి కుందేలు సిగ్గుపడింది. బద్దకంతోపాటు గర్వం ఉండటం వల్లనే పరుగు పోటీలలో కుందేలు అపజయం పాలైంది. నడుచుకుంటూ వెళ్ళిన తాబేలు విజయం సాధించింది. కుందేలుకు గర్వభంగం జరిగింది.
MORAL : నేనే గొప్ప అనుకోవడం అవివేకమే అవుతుంది.