ఒక అడవిలోని కొండ ప్రాంతంలో ఒక చెరువు ఉండేది. దానిలోని చాలా చాపలు మరియు ఇతర ప్రాణజీవులు ఉండేవి. అందులో ఒక ఎండ్రకాయ కూడా ఉంది. ఎక్కడి నుండో ఒక మోసకారి కొంగ అక్కడికి వచ్చి చేపలను చూసింది. ఎలాగైనా ఈ చేపల్ని తినాలి అని ఒక ఉపాయం వేసింది. ప్రతిరోజూ కొంగ చెరువు వద్దకు వచ్చి, ఒంటి కాలిపై నిలబడి తపస్సు చేస్తున్నట్లు నటించేది. కొత్తలో చేపలు భయపడి కొంగ సమీపానికి వెళ్ళలేదు. కొన్ని రోజులకు ఒక్కో చేప దొంగ తపస్సు చేస్తున్న కొంగ దగ్గరకు వచ్చాయి. చేతికందేంత దూరంలో చేపలు ఉన్నప్పటికీ కొంగ వాటికి ఎటువంటి హాని చేసేది కాదు. దొంగ తపస్సు చేస్తూ కదలకుండా ఒంటి కాలిపై నిలబడేది. అదే చెరువులో ఉంటున్న ఒక ఎండ్రకాయ కొంగ వద్దకు వచ్చింది. “కొంగ! నీకు చేతికందేత దూరంలో ఇన్ని చేపలు ఉన్నాయి కదా? వాటిని ఎందుకు తినడం లేదు?” అని ఎండ్రకాయ ప్రశ్నించింది. “నేను మాంసాహారాన్ని మానేశాను, జీవహింస చేయడం పాపమని తెలుసుకుని అహింసా సిద్ధాంతాన్ని పాటిస్తున్నాను” అని అబద్ధపు మాటలు కొంగ చెప్పింది.
ఆ చెరువులోని చేపలతోపాటు ఇతర జలచరాలు కూడా కొంగమాటలు నమ్మి, ప్రతిరోజు నిర్భయంగా కొంగకు అతి సమీపాన వచ్చి నీళ్ళల్లో ఈద సాగాయి. ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి, ఒకరోజు కొంగ ఏడూస్తూ కూర్చుంది. ఆ దృశ్యాన్ని చూసిన చేపలు “ఎందుకు ఏడుస్తున్నావు?” అని ప్రశ్నించాయి. “ఈ ఏడుపు నా గురించి కాదు, మీ గురించే” అన్నది కొంగ. “మా గురించి నువ్వు ఏడవడమేమిటి?” ప్రశ్నించాయి చేపలు. “ఎండాకాలం రాబోతోంది, ఈ చెరువులో నీళ్ళు చాలా వరకు ఇంకిపోయిన తర్వాత జాలర్లు వచ్చి వలలు వేసి మిమ్మల్ని పట్టుకుంటారు. అప్పుడు మీ ప్రాణాలకు అపాయం వస్తుంది. నా రెక్కలతో నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరిపోగలను” అంటూ దొంగ ఏడుపు ఏడుస్తూ కొంగ కన్నీరు కార్చింది. “నువ్వే ఏదో ఒక ఉపాయం ఆలోచించి మా ప్రాణాలు రక్షించు” అని చేపలు ప్రాధేయపడ్డాయి. “ఒక ఉపాయం నా వద్ద ఉంది, ప్రతిరోజూ మీలో కొందరిని నా నోట కరచుకుని కొండకు అవతల ఉన్న పెద్ద సరస్సులో వదులుతాను, ఆ సరస్సు ఎప్పటికీ ఇంకిపోదు. మీరు జీవితాంతం హాయిగా, ఎటువంటి ప్రాణభయం లేకుండా జీవింవచ్చు” అని కొంగ అబద్ధపు మాటలు చెప్పింది.
కొంగ చెప్పిన మాయమాటలను నమ్మిన చేపలు అందుకు అంగీకరించాయి. దాంతో ప్రతిరోజూ కొన్ని చేపల్ని ముక్కున కరచుకుని, ఎగిరిపోయి సరస్సు వైపు కాకుండా కొండపై ఉన్న పెద్ద బండపైకి వెళ్ళి అక్కడ చేపల్ని తినేసేది. మరుసటిరోజు మరి కొన్ని చేపల్ని తీసుకువెళ్ళేది. స్నేహితుల్ని సరస్సులో వదలి కొంగ రక్షిస్తుందని చేపలు భ్రమలో బ్రతికేవి. కొద్ది రోజులకు చెరువులోని చేపలన్నీ అయిపోయాయి. ఎండ్రకాయ ఒక్కటే మిగిలింది. “కొంగ! నా మిత్రులైన చేపలన్నింటినీ సరస్సులో వదిలావు, అదే విధంగా నన్ను కూడా మోసుకెళ్ళి ఆ సరస్సులో వదలి పుణ్యం కట్టుకో” అని ఎండ్రకాయ ప్రాధేయపడింది. “అదెంత పని, నువ్వు నా మెడ చుట్టూ గట్టిగా పట్టుకో. నేను విడవమనే వరకు నా మెడనే పట్టుకుని ఉండు. నిన్ను సునాయాసంగా కొండకు అవతల ఉన్న సరస్సులో వదిలేస్తాను” అన్నది కొంగ.
కొంగ చెప్పినట్లే ఎండ్రకాయ చేసింది, ఇక కొంగ ఆకాశంలో ఎగిరిపోయింది. తీరా చూస్తే అది పెద్ద సరస్సువైపు వెళ్ళకుండా కొండపై ఉన్న పెద్ద బండవైపుకు వెళ్ళడం ఎండ్రకాయ గమనించింది. అక్కడ చేపల ఎముకలు, పొలుసులు దానికి కనిపించాయి. కొంగ తన ప్రాణానికి హాని తలపెట్టబోతుందని ఎండ్రకాయ గ్రహించింది. ఇక ఆలస్యం చేయకుండా పదునుగా ఉన్న తన చేతులతో కొంగ మెడను బలంగా కొట్టింది. నూరు గొడ్లను తిన్న రాబందు ఒక గాలి వానకు పోయినట్టు, చెరువులోని చేపలన్నింటినీ తిన్న కొంగ చివరకు ఎండ్రకాయ చేతిలో బలైపోయింది. మోసాన్ని మోసంతోనే జయించిన ఎండ్రకాయ, మెల్లిగా అక్కడి సరస్సులోకి చేరి ప్రాణాలను కాపాడుకుంది.
MORAL : కాబట్టి మోసబుద్ధిగలవారు చెప్పే తీయని మాటల మాయలో పడితే ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లే. అపాయం వచ్చినప్పుడు మంచి ఉపాయం ఆలోచించి, మనకు ఎటువంటి ముప్పు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.
పెరిగిన వాతావరణం Children stories in Telugu PDF
ఒక అడవిలోని చెట్టుపై చిలుక జంట నివసిస్తుంది. వాటికి రెండు పిల్లలు కలిగాయి. ఒకరోజు చిలుకల జంట ఆహారం వేటలో వెళ్ళాయి. ఆ సమయంలో ఒక దొంగ వచ్చి చిలుకల పిల్లల్ని దొంగిలించి బుట్టలో పెట్టుకొని తీసుకొని పోయాడు. ఆ బుట్టకు రంధ్రం ఉంది. దారిలో ఒక చిలుక పిల్ల క్రింద పడిపోయింది. ఈ దృశ్యాన్ని ఒక యోగి చూసి దారిపై పడిఉన్న ఆ చిలుకను తీసుకుని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. దొంగ వద్ద ఒక చిలుక, యోగి వద్ద మరో చిలుక పెరిగింది. కొద్ది నెలల తరువాత వేటకు మహారాజు ఆ వైపు వచ్చాడు. మొదట దొంగ నివాసముంటున్న ఇంటి ప్రక్కగా మహారాజు గుర్రంపై వెళుతున్నాడు. దొంగ పెంచిన చిలుక మహారాజును చూసి అరవసాగింది.
“ఎవడో దొంగ వచ్చాడు! వాడిని కొట్టండి, బయటకు పంపేయండి” ఇలా ఆ చిలుక అరవ సాగింది. ఆ కేకలకు రాజు భయభ్రాంతుడై గుర్రాన్ని పరుగులు తీయించాడు. ఆ గుర్రం నేరుగా వెళ్ళి యోగి నివసిస్తున్న ఆశ్రమం వద్ద ఆగింది. అక్కడ యోగి పెంచుతున్న చిలుక మహారాజును చూసింది. “ఎవరో అతిథి వచ్చారు! ఆహ్వానించండి. మంచినీరు, ఫలాలు పట్టుకురండి. అతిథి సత్కారం చేయండి” అని ఆ చిలుక అన్నది. చిలుకల కథను యోగి ద్వారా మహారాజు తెలుసుకున్నాడు. “రెండు చిలుక పిల్లలు ఒక తల్లి కడుపునే పుట్టాయి కదా, ఎందుకింత వ్యత్యాసం?” అని మహారాజు ప్రశ్నించాడు. “మహారాజా! రెండు చిలుకలు ఒక తల్లి కడుపునే పుట్టాయి. అయితే పెరిగిన వాతావరణంలో తేడా ఉంది. దొంగ వద్ద ఉన్న చిలుక పెరిగిన వాతావరణం వేరు, మా ఆశ్రమంలో చిలుక పెరిగిన వాతావరణం వేరు. పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళ స్వభావాలలో వ్యత్యాసం వచ్చింది” అని యోగి వివరించాడు.
MORAL : పెరిగిన వాతావరణాన్ని బట్టి బుద్ధుల్లో వ్యత్యాసం ఉంటుంది.
పరోపకారి హంస Children stories in Telugu PDF
ఒక అడవిలో ఒక హంస నివసించేది. అది చాలా పరోపకార బుద్ధి కలది. ఎప్పుడూ ఇతరులకు మేలు చేసేది. ఉత్తమ జాతి పక్షి అయిన హంసతో స్నేహం చేసి, తాను గొప్పలు చెప్పుకోవాలని ఒక కాకి దాని దగ్గరకు వచ్చింది. నమ్మకమైన మాటలు చెప్పి హంసతో స్నేహం చేసింది. మంచి బుద్ధికల హంస తెలియక చెడు బుద్ధికల కాకితో స్నేహం చేసింది. కాకి తన జాతి పక్షుల వద్దకు వెళ్ళి ఉత్తమ జాతి పక్షి అయిన హంస తన నేస్తమని గొప్పలు చెప్పుకోసాగింది. ఒకరోజు వేటగాడు వేటకు వచ్చాడు. ఆరోజు ఎంత తిరిగినా అతడికి పక్షులు దొరకలేదు. ఎండవేడికి అలసిపోయి ఒక చెట్టు క్రింద విశ్రమించి నిద్రపోయాడు. అతడి పరిస్థితి చూసి హంసకు జాలి కలిగింది. నిద్రపోతున్న వేటగాడికి హంస తన రెక్కలతో విసరడం ప్రారంభించింది. ఆ చల్లగాలికి వేటగాడు హాయిగా నిద్రపోయాడు.
ఇది చూసిన నీచబుద్ధికల కాకి “నీది ఎంత మంచి మనస్సు. కానీ మన ప్రాణాలు తీయాలని వచ్చిన వేటగాడికి నువ్వు సేవలు చేస్తున్నావు. ఇలాంటి నీచుడికి సేవ చేయడం నీకు సిగ్గు అనిపించడం లేదా?” అని ఎద్దేవా చేసింది. “ఇతరులు ఎటువంటి వారైనా మనకు చేతనైన సాయం చేయడం మంచి పనేకదా?” అన్నది హంస. “నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో? ఇటువంటి నీచులకు బాగా సేవలు చేసుకో?” అంటూ కాకి వెక్కిరిస్తూ వేటగాడి మొహంపై పెద్ద రెట్ట వేసి వెళ్ళిపోయింది. నిద్రాభంగం అయిన వేటగాడికి పట్టరాని కోపం వచ్చింది. కళ్ళు తెరచి చూస్తే హంస కనిపించింది. ఈ హంసే తన మొహంపై రెట్ట వేసి ఉంటుందని అనుకొని వేటగాడు బాణంతో గురి చూసి హంసని కొట్టబోయాడు. కానీ ప్రమాదాన్ని వెంటనే గ్రహించిన హంస అక్కడి నుండి పైకి ఎగిరిపోయింది. చెడుబుద్ధికల కాకి చేసిన పనికి హంస ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
MORAL : చెడు బుద్ధి కలవారితో స్నేహం అనేది ఎప్పటికైనా ప్రమాదకరమే.
మూడు చేపలు Children stories in Telugu PDF
ఒక చెరువులో మూడు చేపలు నివసిస్తున్నాయి, వాటి పేర్లు సీత, మీనా, దుర్గ. ఇవి ఎంతో స్నేహంగా మెలిగేవి. ఆ ఏడాది వానలు సరిగ్గా కురవక చెరువులో నీరు చాలా వరకు తగ్గింది. ఈ విషయాన్ని సీత అనే చేప గ్రహించి మిగిలిన రెండు చేపలకు చెప్పింది. “మిత్రులారా! ఈ సంవత్సరం వర్షాలు సరిగా కురవలేదు. మనము నివసిస్తున్న చెరువు ఎండిపోతుంది. కాబట్టి మనం మరో చెరువులోకి పోదాము. లేకపోతే జాలర్లు వచ్చి మనల్ని పట్టుకుని చంపేస్తారు” అని సీత మిగిలిన రెండు చేపలను హెచ్చరించింది. “ఆపద వచ్చినప్పుడు ఆలోచిద్దాం. ఆందోళన దేనికి, దైవంపై భారం వేద్దాం” అంది మీనా. దుర్గ ఏమీ మాట్లాడలేదు. వీరిద్దరితో పెట్టుకుంటే తనకు కుదరదని భావించిన సీత, అదేరోజు ఆ చెరువు నుండి మరో పెద్ద చెరుపుకున్న చిన్న పాయలో ఈదుకుంటూ వెళ్ళిపోయింది. కొద్ది రోజులకు చెరువులో నీళ్ళు తగ్గిపోయాయి. జాలర్లు వచ్చి వలలు వేసి చేపలను పట్టసాగారు. మీనా, దుర్గ ఇద్దరూ ఆ వలలో చిక్కుకున్నారు. జాలరి ఆ వలలో చిక్కుకున్న చేపల్ని వేరు చేయడం ప్రారంభించాడు. చనిపోయిన చేపల్ని చెరువు గట్టుపై పడవేసి, బ్రతికి ఉన్న చేపల్ని తన గంపలో వేయసాగాడు. అప్పుడు మీనా కదలక, మెదలక చచ్చిన దానిలా పడివుంది. అది చచ్చిపోయిందని భావించిన జాలరి గంపలో వేయకుండా ఒడ్డుపై విసిరేశాడు. సమయం చూసుకుని మీనా మెల్లిగా చెరువులోకి జారుకుంది. ఏం చేయాలో తెలియక దుర్గ ఊపిరాడక కొట్టుకుంటుంటే, జాలరి తన గంపలో వేసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు.
MORAL : కాబట్టి మంచి మిత్రులు ఇచ్చిన చక్కటి మాటలను వినాలి. ప్రతి విషయంలో దేవుడిపై భారం వేయకుండా, సాధ్యమైనంత వరకు మన ప్రయత్నం మనం చేసి, సాధ్యం కాని విషయాలను మాత్రమే దైవంపై భారం మోపాలి. ప్రతి విషయంలో సీతలా ముందు చూపుతో ఆలోచించి సమస్యల నుండి బయటపడాలి.