కోతి మరియు మొసలి Chinna Pillala Kathalu

Chinna Pillala Kathalu
కోతి మరియు మొసలి Chinna Pillala Kathalu

ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది. దానిపై ఒక కోతి నివసిస్తుంది. చెట్టు ప్రక్కనే ఒక నది ప్రవహిస్తుంది. పండిన పండ్లను తిని, నదిలోని నీరు తాగుతూ కోతి హాయిగా జీవించసాగింది. ఒకరోజు కోతి పండ్లు తింటుంటే, ఒక పండు దాని చేయిజారి నదిలోని నీటిలో పడింది. ఆ పండును నదిలో నివసిస్తున్న మొసలి తిన్నది. ఆ పండు దానికి ఎంతో రుచిగా అనిపించింది. “కోతి! ఈ పండ్లు తినాలని నాకు ఎప్పటినుండో కోరిక. ఈరోజు నీ దయవల్ల ఒక పండు తిన్నాను. చాలా రుచిగా ఉంది, మరికొన్ని పండ్లు కోసి ఇస్తే తింటాను” అన్నది మొసలి. మొసలి మాటలకు జాలి పడిన కోతి కొన్ని పండ్లు కోసి దానికి ఇచ్చింది. ఆ పండ్లను తిని మొసలి చాలా ఆనందించింది. ఇలా ప్రతిరోజు మొసలి రావడం, కోతి దానికి పండ్లు పెట్టడం, మొసలి తినడం జరుగుతున్నాయి. ఇలా కొన్నాళ్ళు జరిగి వారిద్దరి మధ్య స్నేహం బలపడింది. ఈ క్రమంలో మొసలి తన ఇంటికి వెళ్ళడం కూడా తగ్గించింది.

ఒకరోజు మొసలి నది మధ్యలో ఉన్న తన ఇంటికి వెళ్ళింది. దాని భార్యకు ఆరోగ్యం బాగా లేదు. అప్పుడే వైద్యుడు వచ్చి పరీక్షించాడు. “ఏం జరిగింది?” ప్రశ్నించింది మొసలి. “అయ్యా! నువ్వు కొద్దిరోజుల నుండి ఇంటికి రావడం లేదు. మీ ఆవిడ బెంగతో జబ్బు ముదిరింది. కోతి గుండెకాయ తెచ్చి ఇచ్చినచో మంచి ఔషధము చేసి ఇస్తాను” అన్నాడు వైద్యుడు. “నామిత్రుడైన కోతి చాలా మంచివాడు. మిత్రుని చంపడం పాపమౌతుంది. భార్యను బ్రతికించుకోవడానికి తప్పదు. చాలా విధాలుగా ఆలోచించినా, భార్య కంటే స్నేహితుడు ఎక్కువేం కాదు” ఇలా మొసలి తన మనసులో ఆలోచించసాగింది. మొసలి నది ఒడ్డున చేరి “మిత్రమా! నా భార్యకు మన స్నేహం గురించి చెప్పాను. ఒకరోజైనా మా ఇంటికి నిన్ను తీసుకురమ్మని గోల చేస్తుంది. అందువల్ల నిన్ను తీసుకువెళ్ళాలని వచ్చాను. నా వీపు మీద నువ్వు కూర్చునట్టైతే నదిలోని మా ఇంటికి నిన్ను తీసుకుని వెళతాను” అని కోతితో అన్నది.

మొసలి మాటలను కోతి నమ్మి చెట్టు దిగి వచ్చి, మొసలి వీపుపై కూర్చుంది. వెంటనే మొసలి తన మిత్రుడైన కోతిని మోసుకుని ఈదుకుంటూ నదిలోని తన ఇంటికి బయలుదేరింది. నది మధ్యలో చేరగానే మొసలి మాట్లాడుతూ “నేను ఈరోజు పెద్ద పాపం చేయబోతున్నాను. నా భార్య అనారోగ్యంతో ఉంది. కోతి గుండెకాయ తెచ్చినట్టైతే ఔషధం తయారు చేస్తానని వైద్యుడు చెప్పాడు. అందువల్ల నిన్ను తీసుకుని వెళుతున్నాను. నిన్ను చంపి నీ గుండెకాయతో ఔషధం తయారుచేయించి నా భార్యను బ్రతికించుకుంటాను” అన్నది. “ఈ దుష్ట మొసలి మాటలు నమ్మి నా ప్రాణాలపైకి తెచ్చుకున్నాను కదా?” అని కోతి చింతించింది. ఇంతలో కోతికి మెరుపులాంటి ఉపాయం తట్టింది. “మిత్రమా! నువ్వు ఇంత తెలివితక్కువ పని చేశావేమిటి? ఈ విషయం నాకు అక్కడే చెప్పివుంటే బాగుండేది. నేను నా గుండెకాయను చెట్టుకు తగిలించి వచ్చాను. గుండెకాయ లేని నన్ను తీసుకువెళ్ళినా ప్రయోజనం లేదు కదా?” అని కోతి చెప్పింది.

“నేను ఎంత తెలివితక్కువ పని చేశాను. వెంటనే వెనుతిరిగి నిన్ను చెట్టు వద్దకు తీసుకుని వెళతాను. నువ్వు గుండెకాయ తీసుకుని రా” అని మొసలి చెప్పి చాలా వేగంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది. కోతి శరవేగంతో ఒడ్డున దూకి చెట్టెక్కి కూర్చొంది. “మిత్రమా! గుండెకాయ తెస్తానని చెట్టెక్కి కూర్చొని దిగవేమిటి?” ప్రశ్నించింది మొసలి. కోతి మాట్లాడుతూ “మూర్ఖుడా! ఎవరి గుండె వారి వద్దనే ఉంటుంది. చెట్టుకెక్కడైనా తగిలిస్తారా? నా ప్రాణాలు తీస్తావని నిజం తెలిసినా నీ వెంట రావడానికి నేనేమైనా తెలివి తక్కువ దద్దమ్మననుకున్నావా? మిత్రద్రోహి. వెనుతిరిగి పో” అంటూ మొసలితో చెప్పింది. చేసేది లేక మొసలి దిగాలుగా వెళ్ళిపోయింది.

MORAL : మనం తెలివిగా ఆలోచిస్తే, ఎంత ప్రమాదాన్ని అయినా సులువుగా చేదించవచ్చు.

పాము మరియు బ్రాహ్మణుడు Chinna pillala Kathalu

Chinna Pillala Kathalu
పాము మరియు బ్రాహ్మణుడు Chinna Pillala Kathalu

ఒక నది ఒడ్డున పెద్ద పాము పుట్ట ఉంది. ఆ పాము ప్రతిరోజూ పుట్ట నుండి బయటకు వచ్చి సమీపాన ఉన్న చెరువులోని కప్పల్ని తినేది. కొన్నాళ్ళకు ఆ మడుగులోని కప్పలన్నీ అయిపోయాయి. ఆకలి బాధ పడలేక పాము ఆహారం కోసం సమీపాన ఉన్న అడవికి బయలుదేరింది. అక్కడ కూడా దానికి ఆహారం లభించలేదు. పాము దిగాలుగా వస్తుంటే, గడ్డి పొదల నుండి మంటలు నలువైపులా వ్యాపించడంతో పాము వెళ్ళడానికి దారి లేదు. మంటల మధ్య పాము ఇరుక్కుంది. ఇక తనకు చావు తప్పదని పాము కంగారు పడసాగింది. తనను కాపాడమని పాము కేకలు వేసింది. ఇంతలో అటుగా వెళుతున్న ఒక బ్రాహ్మణుడు ఆ కేకలు విని ప్రమాదంలో ఉన్న పాము పరిస్థితి చూసి జాలిపడ్డాడు. వెంటనే తన సంచిని ఆ మంటల్లో విసిరాడు. “నాగరాజా! నువ్వు ఈ సంచిలో దూరు. నేను కర్రతో సంచిని నెమ్మదిగా మంటల్లో నుండి లాగి నిన్ను రక్షిస్తాను” అన్నాడు బ్రాహ్మణుడు.

బ్రాహ్మణుడు చెప్పినట్లే పాము అతడు విసిరిన సంచిలోకి దూరింది. ఒక కర్రసాయంతో సంచిని నెమ్మదిగా మంటలు తగలకుండా బయటకు తీసి పామును కాపాడాడు. ఆపదలో ఉన్న పామును రక్షించినందుకు బ్రాహ్మణుడు చాలా సంతోషించాడు. ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. వెనుతిరిగి చూస్తే పాము పడగ విప్పి బుసలు కొట్టింది. బ్రాహ్మణునికి భయమేసి “ఇదేమిటి నాగరాజా! నేను నీ ప్రాణాలను కాపాడాను. నాపైనే బుసలు కొడతావా?” అని ఆవేదన చెందుతూ అడిగాడు. “నీ జాతి ధర్మం నువ్వు చూపావు, నా జాతి ధర్మం నేను చెయ్యాలి కదా?” అన్నది పాము. చేసేది లేక బ్రాహ్మణుడు పరుగులెత్తాడు. పాము అతడిని వెంబడించింది. ఆ సమయంలో బ్రాహ్మణుడికి ఒక గాడిద ఎదురొచ్చింది. “బ్రాహ్మణోత్తమా! ఎవరో రాక్షసుడు నిన్ను వెంటాడుతున్నట్లు ఎందుకా పరుగు?” అని గాడిద ప్రశ్నించింది. “రాక్షసరూపంలో ఉన్న పాము నన్ను వెంటాడుతుంది” అన్నాడు బ్రాహ్మణుడు. ఇంతలో పాము అక్కడకు వచ్చి బుసలు కొడుతూ ఆగింది.

బ్రాహ్మణుడు జరిగిందంతా గాడిదకు చెప్పాడు. “మీరే న్యాయం చెప్పండి. రక్షించిన నన్ను చంపాలనుకోవడం పాముకు ధర్మమా?” అన్నాడు బ్రాహ్మణుడు. పాము కూడా గాడిద వైపు చూసింది. పాముకు వ్యతిరేకంగా మాట్లాడితే తన ప్రాణానికి ముప్పు వస్తుందని గాడిద భావించింది. వెంటనే గాడిదకి ఒక ఉపాయం తోచింది. “ఏదైనా కళ్ళతో చూస్తేనే నేను నమ్ముతాను, ఏం జరిగింది? ఎలా జరిగింది? అనేది నాకు మీరు కళ్ళకు కట్టినట్లు చూపించండి. అప్పుడు నేను న్యాయం చెబుతాను” అంది గాడిద. అందరూ కలసి మంటల వద్దకు వచ్చారు. పాముని మంటల మధ్యలో వేసింది గాడిద. మంటల సెగకు పాము కేకలు పెడుతూ “ఓ బ్రాహ్మణోత్తమా! ఇంతకు క్రితంలా సంచిని వెయ్యి” అన్నది పాము. బ్రాహ్మణుడు సంచిని వేయబోయాడు.

“ఓ వెర్రి బ్రాహ్మణుడా! ఆ సంచిని మంటల్లో వేయకు. సాయం అనేది కృతజ్ఞతా భావం ఉన్నవాళ్ళకు, సాయం వారికే చేయాలి. లేదంటే మనకే ముప్పు కలగవచ్చు” అన్నది గాడిద. బ్రాహ్మణుడు, గాడిద ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. మంటలు చెలరేగడంతో పాము అందులో తగలబడి, మాడి మసైపోయింది.

MORAL : మనం చేసే సహాయాన్ని ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్లకే మనము సహాయం చేయవలెను. లేదంటే అది మనకే కీడు చేయవచ్చు. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *