ఒక గ్రామంలో నివసించే బ్రాహ్మణుడు ఒక మేకను పెంచుకోవడం కోసం సంతలో ఒక నల్ల మేకను కొని తీసుకుని భుజాలపై పెట్టుకొని తన ఊరికి బయలుదేరాడు. దారిలో నలుగురు దొంగలు అతడ్ని అనుసరించారు. ఎలాగైనా ఈ మేకను తాము కాజేయాలని పథకం వేశారు. తొలుత ఒకడు దొంగ బ్రాహ్మణుడి వేషంలో ఎదురయ్యాడు. “అయ్మా! తమరు బ్రాహ్మణోత్తముల్లా ఉన్నారు. నల్లకుక్కను భుజాలపై పెట్టుకుని వెళుతున్నారేమిటి” అని ప్రశ్నించాడు. “ఓ అమాయకుడా! నా భుజాలపై ఉంది నల్లమేక, నల్లకుక్క కాదు. మేకను పట్టుకుని కుక్క అంటావేంటి, పనిచూస్కో” అని బ్రాహ్మణుడు అతడితో అని ముందుకు సాగాడు. కొంతదూరం పోయాక రెండవ దొంగ ఎదురై “బ్రాహ్మణోత్తమా! మీ భుజాలపై నల్ల కుక్కను మోసుకుని వెళుతున్నారేమిటి?” అన్నాడు. “నీకు పిచ్చిగాని పట్టిందా? నల్లమేకను పట్టుకొని నల్లకుక్క అంటున్నావు” అని తిట్టి ముందుకు సాగాడు.
వీళ్ళంతా కావాలని అలా అంటున్నారని బ్రాహ్మణుడు భావించాడు. ఇంకొంత దూరం పోయాక మూడవ దొంగ ఎదురై అదే విధంగా అన్నాడు. మరికొంత దూరం పోయాక నాల్గవ దొంగ ఎదురై “నల్ల కుక్కను తీసుకుని వెళుతున్నారేమిటి? కుక్కంటే శని. భుజాలపై శనిని మోసుకుని వెళుతున్నారా? దాన్ని విడిచిపెట్టండి” అని అన్నాడు. ఇంతమంది అలా చెప్పేపాటికి బ్రాహ్మణుడికి అనుమానం వచ్చింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు నలుగురు అదే విధంగా అన్నారు. కాబట్టి వారు చెప్పిందే నిజమని బ్రాహ్మణుడు భావించి, అది నల్లమేక కాదు నల్లకుక్క అని భావించాడు. వెంటనే ఆ నల్లమేకను వదిలేశాడు.
MORAL : కొన్ని సందర్భాలలో నలుగురు చెప్పింది కూడా నిజం కాకపోవచ్చు. వాళ్ళూ, వీళ్ళూ చెప్పారు కదా అని మనం నిర్ణయాలు తీసుకోకూడదు. అందులోని నిజానిజాలు అవగాహనతో తెలుసుకున్న పిదపే మనం ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి.
కుక్కపాట్లు కథలు Telugu Kathalu for Kids
ఒక నగరంలో కొన్ని ఊరకుక్కలు ఉన్నాయి. అవి దొరికింది తింటూ తిరుగుతూ హాయిగా ఉన్నాయి. ఒకసారి ఆ నగరంలో కరువు వచ్చింది. తినడానికి ఏమీ దొరకలేదు, కొన్ని కుక్కలు జబ్బుపడ్డాయి. మరి కొన్ని కుక్కలు చనిపోయాయి. ఒక ఊరకుక్క ఆకలి బాధ భరించలేక మరో నగరానికి వెళ్ళింది. ఆ నగరంలో ఇళ్ళ తలుపులన్నీ తెరిచే ఉన్నాయి. ఇళ్ళల్లో ఆహార పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయి. గృహిణులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. కుక్క ఇళ్ళల్లో ప్రవేశించి దొరికింది తింటూ ఉల్లాసంగా గడపసాగింది. ఒకరోజు కుక్క ఒక ఇంట్లో రుచికరమైన ఆహార పదార్థాలు తిని నెమరు వేసుకుంటూ ఇంట్లో నుండి బయటకు వచ్చింది. అప్పుడు ఆ నగరానికి చెందిన కొన్ని ఊరకుక్కలు దీన్ని చూశాయి. “ఇది మన నగరానికి చెందిన కుక్క కాదు. అయినప్పటికీ ఇళ్ళల్లో దూరి కడుపునిండా తిని వస్తుంది” అని అక్కసు వెళ్ళగక్కుతూ మూకుమ్మడిగా ఆ కుక్కపై దాడిచేశాయి.
ఆ దాడిలో కుక్క తీవ్ర గాయాలపాలైంది. “నా నగరమే నయం. దొరికింది ఏది తిన్నా నా జాతివారెవరూ దాడి చేసేవారు కాదు. కరువు కాటకాలు వచ్చినప్పటికీ కొంత మనశాంతిగా బతికాను. పుట్టిన ఊళ్ళోనే కొంత రక్షణ ఉంది” అని భావించి వెంటనే తన నగరానికి తిరిగి వచ్చింది. నగరానికి చేరగానే తన పాత మిత్రులైన కొన్ని ఊరకుక్కలు చుట్టూ చేరాయి. “మిత్రమా! నువ్వు వెళ్ళిన నగరం విశేషాలేమిటి? అక్కడ ఆహారం బాగా దొరుకుతుందా?” ఇలా ప్రశ్నల వర్షం కురిపించాయి. అందుకు ఊరకుక్క బదులిస్తూ “ఆ నగరంలో ఆహారం బాగానే దొరుకుతుంది, మనం తృప్తిగా తినవచ్చు. అలా తినడం చూస్తే మన జాతి ఊరకుక్కలే ఓర్చుకోలేవు. మనపై దాడి చేసి గాయపరుస్తాయి. మనం ఇతర ప్రాంతాల వాళ్ళమని వివక్షత చూపిస్తాయి. వాళ్ళు పెట్టే బాధలు భరించలేక తిరిగి మన నగరానికే తిరిగి వచ్చేశాను. ఏది ఏమైనా జన్మభూమిని మించిన స్వర్గం లేదు” అన్నది ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన ఊరకుక్క. సుదూర ప్రాంతాలకు వెళ్ళి కుక్క పడిన కష్టాలను విని తోటి కుక్కలు నీరసంతో చతికిలపడ్డాయి.
రాజు మరియు కుమ్మరి కథలు Telugu Kathalu for Kids
ఒక గ్రామంలో కుండలు చేసుకుని బ్రతికే కుమ్మరి ఉండేవాడు. ఒకరోజు అతడు చాలా కుండలు తీసుకుని ప్రక్క గ్రామంలో అమ్ముకోవాలని మోసుకుని తీసుకుపోతున్నాడు. ఆ సమయంలో అతడి కాలు జారి ఎదురుగా ఉన్న బండపై పడ్డాడు. బండరాయి తగిలి తలకు పెద్ద గాయమైంది, కుండలన్నీ పగిలిపోయాయి. కుమ్మరి గాయానికి వైద్యం చేయించుకున్నాడు. గాయమైతే తగ్గింది కానీ తలకు మచ్చ అలానే ఉండిపోయింది. కొద్ది రోజుల తరువాత ఆ గ్రామంలో భయంకరమైన కరువు వచ్చి పడింది. కుమ్మరి ఆ గ్రామంలో బ్రతకలేక భార్యతో సహా నగరానికి వెళ్ళాడు. రాజుగారి ఆస్థానంలో ఏదైనా పని దొరుకుతుందని వెళ్ళాడు. కుమ్మరి తలపై ఉన్న మచ్చను చూసి మహారాజు పొరపాటు పడ్డాడు. ఈ మచ్చ యుద్ధంలో అయిన గాయంగా రాజు అనుకున్నాడు. వివరాలు కనుక్కోకుండా కుమ్మరిని ప్రశంసించాడు. “ఇటువంటి వీరులు మనకు చాలా అవసరం. ఇతని వీరత్వానికి తలపై ఉన్న గాయమే నిదర్శనం” అన్నాడు మహారాజు.
కుమ్మరి కూడా మాట్లాడకుండా ‘కొలువు దొరికింది చాలు’ అనుకుని మౌనంగా ఉన్నాడు. ఒకరోజు పలుదేశాల రాజకుమారులు వచ్చి వారికి వచ్చిన యుద్ధ విద్యలు ప్రదర్శించి మహారాజు ప్రశంసలందుకున్నారు. “మా కొలువులో కూడా ఇంతటి నిష్ణాతులు ఉన్నారు” అని గొప్పగా మహారాజు ప్రకటించాడు. అయితే కుమ్మరి ముందుకు రాకపోవడం చూసి మహారాజు ఆశ్చర్యపోయాడు. “నీ విద్యలు ఎందుకు ప్రదర్శించడం లేదు?” అని మహారాజు కుమ్మరిని ప్రశ్నించాడు. “మహారాజా! నేను కుమ్మరిని. నాకు కుండలు తయారు చేయడం తప్ప మరో పని రాదు” అన్నాడు కుమ్మరి. ఇది విన్న మహారాజుకు పట్టరాని ఆగ్రహం కలిగింది. “ఈరోజు నీ వల్ల నా పరువు ప్రతిష్ఠలు కోల్పోవాల్సి వచ్చింది. తక్షణం నా కళ్ళముందు నుండి వెళ్ళిపో” అంటూ మహారాజు అరిచాడు.
మహారాజు గారి మాటలు విన్న కుమ్మరి “మీరు ఆజ్ఞ ఇస్తే ఏదో ఒక విద్యను ప్రదర్శిస్తాను” అన్నాడు కుమ్మరి. కుమ్మరి మాటలకు మహారాజు పెద్దగా నవ్వి “గొప్పలకు పోకు కుమ్మరి. నీకు తెలిసిన కుండలు తయారుచేసే విద్యను నీ వాళ్ళతో కలిసి చెయ్యి. ఇక్కడ నువ్వు చేయదగిన పనిలేదు” అని కుమ్మరిని కొలువు నుండి పంపించివేశాడు.
MORAL : మనకు ఏ పని వచ్చో, ఆ పని చేసుకోవడమే మంచిది. మనకు రాని పని చేస్తే, నష్టపోయే ప్రమాదం ఉంది.