ఒక చెరువులో ఒక తాబేలు నివసించేది. ప్రతిరోజు ఆ చెరువుకు రెండు కొంగలు వచ్చేవి. వాటి మధ్య గాఢమైన స్నేహం ఏర్పడింది. ఎండా కాలం రావడంతో ఆ చెరువు ఎండిపోసాగింది. చాలా నీళ్ళున్న పెద్ద చెరువులోకి వెళ్ళాలని తాబేలు అనుకుంది. ఈ విషయాన్ని తన మిత్రులైన కొంగలకు చెప్పింది. “మిత్రమా! నువ్వు ఎగరలేవు. మేము నిన్ను సుదూరంగా ఉన్న చెరువులోకి ఎలా తీసుకుని వెళ్ళగలం” అని కొంగలు అన్నాయి. “మిత్రులారా! అలా అనకండి, మీరే ఏదో ఉపాయాన్ని ఆలోచించి నన్ను నీళ్ళున్న పెద్ద చెరువుకు చేర్చండి” అని తాబేలు ప్రాధేయపడింది. ముగ్గురూ కలసి చాలా ఆలోచించారు. తాబేలుకు ఒక ఆలోచన వచ్చింది. “మిత్రులారా! ఒక కర్రపుల్ల తీసుకుని రండి. మీరిద్దరూ ఆ పుల్లను చెరొక మూల మీ ముక్కులతో పట్టుకోండి. నేను నా నోటితో కర్ర మధ్యభాగాన పట్టుకుంటాను. మీరు ఆకాశంలో ఎగురుతూ మీతోపాటు నన్ను కూడా తీసుకొని వెళ్ళవచ్చు” అన్నది తాబేలు.
“ఇది చాలా ప్రమాదకరం మిత్రమా! నువ్వు మధ్యలో మాట్లాడటానికి నోరు తెరిస్తే ప్రాణాపాయం కలుగుతుంది” అన్నాయి కొంగలు. “నేను ఎక్కడా నోరు తెరచి మాట్లాడనని మీకు మాట ఇస్తున్నాను” అన్నది తాబేలు. తాబేలు కర్రపుల్ల మధ్యలో తన నోటితో బలంగా పట్టుకుంది. కొంగలు ఆ కర్రపుల్ల ఇరువైపులా తమ ముక్కులతో బలంగా పట్టుకొని ఆకాశంలో ఎగరసాగాయి. తాబేలుకు ఎటువంటి ప్రమాదం కలగకుండా ఉండాలని కొంగలు తక్కువ ఎత్తులో ఎగరసాగాయి. ఈ దృశ్యాన్ని ఒక గ్రామంలో ప్రజలు చూసి వింతగా నవ్వసాగారు. ఈ దృశ్యాన్ని చూసిన తాబేలుకు ఎక్కడ లేని కోపం వచ్చింది. “ఈ మనుషులకు బుద్ధిలేదు” అని చెప్పబోయి నోరు తెరుచిన తాబేలు, తన మాట పూర్తి కాకుండానే నేలపై పడిపోయింది. ఆ గ్రామంలోని ఒకడు తాబేలును తీసుకొని వెళ్ళిపోయాడు.
MORAL : ఉపాయంతో ఆలోచించి ప్రమాదం లేని ప్రణాళికలు తయారుచేసుకోవాలి.
కుందేలు, పావురము మరియు పిల్లి Telugu Moral Stories for Kids
ఒక అడవిలో కుందేలు నివాసముంటుంది. ఒకసారి కుందేలు కొంతకాలం సుదూర ప్రాంతానికి వెళ్ళింది. ఆ సమయంలో ఒక పావురం దాని నివాసాన్ని ఆక్రమించుకుంది. సుదూర ప్రాంతానికి వెళ్ళిన కుందేలు కొద్ది రోజుల తరువాత తిరిగి వచ్చి, పావురం తన నివాసాన్ని ఆక్రమించుకోవడం చూసింది. “ఇది నా నివాసాన్ని నువ్వు ఆక్రమించుకోవడం సరికాదు. నేను ఎంతో శ్రమతో ఈ నివాసాన్ని నిర్మించుకున్నాను. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో” అన్నది కుందేలు. “ఈ అరణ్యంలో ఎవరు ఎక్కడైనా నివసించవచ్చు. ఇదేదో నీ సొంత స్థలం అన్నట్లు కేకలు వేస్తున్నావు. నువ్వు చాలా కాలంగా ఇక్కడ నివాసం లేవు, కాబట్టి ఈ నివాసంపై నువ్వు హక్కును కోల్పోయావు. నువ్వే వేరొకచోటికి నీ నివాసాన్ని మార్చుకో” అని పావురం చెప్పింది. ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. “ఎవరినైనా న్యాయం అడుగుదాము” అన్నది కుందేలు. “సరే పద” అన్నది పావురం.
ఇద్దరూ కలసి వెళుతుండగా, దారిలో ఒక చెట్టు క్రింద జపమాలతో తపస్సు చేసుకున్నట్లు నటిస్తూ, ఆహారం కోసం ఎదురు చూస్తున్న ఒక వృద్ధ పిల్లి కనిపించింది. ఆహారం కోసం పరుగులు తీయలేక వృద్ధాప్యంలో ఈ వేషం వేసుకుని తనవైపు వచ్చిన అమాయకపు అల్పప్రాణుల్ని చంపి తినడానికి ఆ పిల్లి అలవాటు పడింది. ఈ విషయం తెలియక కుందేలు, పావురం తీర్పు చెప్పమని దారిలో కనిపించిన పిల్లి వద్దకు వెళ్ళాయి. పిల్లిని చూడగానే కుందేలుకు భయం వేసింది. “ఈ పిల్లిని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. మనం దాన్ని సమీపిస్తే ప్రాణహాని కలుగుతుందని భయంగా ఉంది” అన్నది కుందేలు. “అంత భయంగా ఉంటే నేను ఉన్నచోటు ఖాళీచేయమని అడగకు, నీ దారి నువ్వు చూసుకో, ఏ సమస్యా ఉండదు” అన్నది పావురం.
“అదెలా కుదురుతుంది, అది నా నివాసం, జరగాల్సింది జరుగుతుంది. పిల్లివద్దకే వెళ్దాము” అన్నది కుందేలు. పిల్లి జపం చేస్తున్నట్లు నటిస్తుంది. వృద్ధాప్యం వల్ల అది చాలా కాలంగా ఆహారాన్ని సంపాదించుకోలేకపోయింది. ఇప్పుడు ఆహారమే వెతుక్కుంటూ తనవద్దకు వచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా పిల్లి అమాంతం కుందేలు, పావురం మీదకు దూకి చేతులతో పట్టుకున్నది. పిల్లి ఏదో ఉపకారం చేస్తుందని భ్రమపడి దాని దగ్గరకు వెళ్ళిన కుందేలు, పావురం ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాయి.
MORAL : సమస్యలు వచ్చినప్పుడు సామరస్యంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. మనకుహాని చేసే వారని తెలిసిన కూడా వారిని సహాయం అర్థిస్తే మేలుకంటే కీడే ఎక్కువగా జరుగుతుంది.
ఎలుక మరియు పిల్లి Telugu Moral Stories for Kids
ఒక అడవిలోని పెద్ద చెట్టు తొర్రలో ఒక పిల్లి నివసిస్తుంది. ఆ చెట్టు క్రిందనే ఉన్న రంధ్రంలో ఒక ఎలుక నివసిస్తుంది. పిల్లి నివసించే చెట్టు చుట్టూ ఒక వేటగాడు రాత్రివేళలో ఒక వల పెట్టాడు. పిల్లి ఆ వలలో ఇరుక్కుంది, పిల్లి బాధపడుతూ రోధించసాగింది. పిల్లి ఏడుపు విని ఎలుక తన రంధ్రంలో నుండి బయటకు వచ్చింది. తన శత్రువు వలలో ఇరుక్కుని ప్రాణాపాయస్థితిలో ఉండటం చూసిన ఎలుక మహదానందంతో గంతులేసింది. ఇక వలలో ఇరుక్కున్న పిల్లి ముందే ఎలుక నిర్భయంగా తిరగసాగింది. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఒక గుడ్లగూబ చూసింది. ఎలుకను చూడగానే దాన్ని తినాలని గుడ్లగూబకు నోరూరింది. గుడ్లగూబను చూడగానే ఎలుకకు భయంతో చెమటలు పట్టాయి. పిల్లితో స్నేహం చేస్తే గుడ్లగూబ వల్ల తనకు ప్రాణహాని ఉండదని ఎలుక అనుకొని పిల్లితో మాట్లాడింది.
“నేస్తమా! బాగున్నావా. ఈ చెట్టు క్రింద ఇద్దరం ఎంతో అన్యోన్యంగా సోదరుల్లా జీవించాము. నీ వల్ల నాకు గానీ, నా వల్ల నీకు గానీ ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఇప్పటివరకు కలగలేదు. నిన్ను ఈ వల నుండి తప్పించాలని నేను భావిస్తుండగా ఈ గుడ్లగూబ ఎక్కడి నుండో వచ్చింది. అది నన్ను తినేస్తుందేమోనని భయంగా ఉంది” అంటూ భయం నటిస్తూ పిల్లితో చెప్పింది ఎలుక. పిల్లి ఆ వైపు చూస్తే గుడ్లగూబ కనబడింది. “మిత్రమా! నాతో స్నేహం చేస్తావా? నేను నిన్ను ఈ వలలో నుండి కాపాడతాను. అయితే నన్ను నువ్వు చంపకూడదు” అని పిల్లితో అన్నది ఎలుక. “నా ప్రాణాలు కాపాడిన నిన్ను నేను ఎందుకు చంపుతాను. పైగా నన్ను నువ్వు కాపాడితే గుడ్లగూబ బారి నుండి నిన్ను రక్షిస్తానని మాట ఇస్తున్నాను” అన్నది పిల్లి.
పిల్లి మాటలు నమ్మిన ఎలుక వలను కొరకడానికి సిద్ధమయ్యింది. పిల్లి, ఎలుక ఎప్పుడైతే స్నేహంగా దగ్గరయ్యాయో గుడ్లగూబ భయపడి పోయింది. ఎలుకను తినాలనే తన కోరిక తీరకపోగా పిల్లి చేతిలో తన ప్రాణాలు పోవడం ఖాయమని భావించిన, గుడ్లగూబ అక్కడి నుండి ఎగిరిపోయింది. ఇంతలో వేటగాడు వస్తూ కనిపించాడు. “మిత్రమా! వేటగాడు వస్తున్నాడు. ఆలస్యం చేయకుండా ఈ వలను కొరికి నన్ను బంధవిముక్తి చేసి రక్షించు” అని ప్రాధేయపడింది పిల్లి. ఎలుక ఆలస్యం చేయకుండా వలను కొరికేసి రంధ్రంలోకి వెళ్ళిపోయింది. వల నుండి బయటపడ్డ పిల్లి ఆలస్యం చెయ్యకుండా చెట్టెక్కేసింది. వేటగాడు నిరాశగా చిరిగిన వల తీసుకుని వెళ్ళిపోయాడు. కాసేపటికి పిల్లి చెట్టుదిగి ఎలుక రంధ్రం వద్దకు చేరింది. “ఎలుక మిత్రమా! మనిద్దరం ఇప్పుడు స్నేహితులం, నువ్వు నన్ను కాపాడావు. నిన్ను ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. వెంటనే రంధ్రంలో నుండి బయటకురా?” అని పిల్లి ప్రాధేయ పడింది. “నీ మాటలు నేను నమ్మను పిల్లి మిత్రమా! పొద్దున నుండి వలలో చిక్కుకుని అసలే నువ్వు ఆకలితో ఉన్నావు. ఆకలికి స్నేహాలు, ఆత్మీయతలు ఉండవంటారు. నేను రంధ్రంలో నుండి బయటకు వస్తే నువ్వు నన్ను తినేస్తావు. నీ స్నేహానికి ఒక నమస్కారం. నేను రంధ్రంలో నుండి బయటకు రాను” అని చెప్పింది ఎలుక. పిల్లి చేసేది లేక వెళ్ళిపోయింది.
MORAL : మనం ఎవరికీ సహాయం చేసిన సరే మన జాగ్రత్తలో మనం ఉండటం చాలా మంచిది.