పాము మరియు కప్పరాజు Telugu stories for Kids PDF

Telugu stories for Kids PDF
పాము మరియు కప్పరాజు Telugu stories for Kids PDF

ఒక అడవిలో ముసలి పాము ఉండేది. ఒకరోజు దానికి ఆహారం దొరకలేదు. ఆకలి బాధతో అడవిలో తిరుగుతూ ఒక చెరువు వద్దకు చేరింది. అక్కడ దానికి అనేక కప్పలు కనిపించాయి. ఎలాగైనా ఇక్కడే కొంతకాలం నివసించి కప్పలను తినాలని పాము నిర్ణయించుకుంది. పాము చాలా దిగులుగా, మెల్లిగా పాకుతూ చెరువు ఒడ్డుకు చేరింది. పామును చూడగానే కప్పలన్నీ భయపడి పారిపోయాయి. “ఓ కప్ప మిత్రులారా! నేను మిమ్మల్ని చంపాలనే కాంక్షతో ఇక్కడికి రాలేదు. నేను మీ రాజుతో ఒక విన్నపం చేసుకోవడానికి వచ్చాను. కాబట్టి నన్ను చూసి మీరంతా భయపడకండి” అని చెప్పింది పాము. పాము మాటలకు కప్పల రాజు ఆశ్చర్యపోయాడు. “నేనే కప్పల రాజును. నువ్వు ఏం చెప్పదలచుకున్నావో చెప్పు” అని పాముతో కప్పల రాజు అన్నాడు. “నాకు కలిగిన కష్టాలను నీతో చెప్పుకోవాలని ఇక్కడికి వచ్చాను” అన్నది పాము. “నీకు కలిగిన కష్టమేమిటి?” పామును ప్రశ్నించాడు కప్పల రాజు.

పాము చాలా బాధపడుతూ “నిన్న రాత్రి నేను ఆహారం వేటలో తిరుగుతున్నాను. ఆ సమయంలో ఒక బ్రాహ్మణ బాలుడు నా తోకను తొక్కాడు, అందువల్ల నాకు కోపం వచ్చి కాటు వేశాను. నా విషం బాలుడి శరీరంలో ప్రవేశించేపాటికి మూర్ఛపోయాడు. ఆ సమయంలో బాలుడు చనిపోయాడని భావించిన అతని తల్లిదండ్రులు బిగ్గరగా ఏడుస్తూ కూర్చున్నారు. ఆ సమయంలో మంత్రశాస్త్రం తెలిసిన ఒక వ్యక్తి తన శాస్త్ర పరిజ్ఞానంతో బాలుడిని బ్రతికించాడు. ఆ తరువాత బాలుడి తండ్రి నా వైపుచూసి ‘నా బిడ్డను బాధపెట్టిన ఓ విషసర్పమా! నీ ఆహారమైన కప్పలకు నువ్వు వాహనమై, వాటిని మోస్తూ, ఆ కప్పలు దయతలచి పెట్టిన ఆహారాన్ని తిని బ్రతుకు’ అంటూ శపించాడు. అప్పటి నుండి నాకు ఆహరం దొరకడం లేదు, ఆకలితో అలమటిస్తున్నాను” అంటూ బాధ నటిస్తూ చెప్పింది పాము.

“బాధపడకు, నీకు ఆహారం నేను ఇస్తాను సర్పరాజా! అయితే నువ్వు ఒక పని చేయాలి. నాతో పాటు, నా మంత్రులను సైతం మోస్తూ ఈ చెరువు చుట్టు తిప్పు. నా గొప్పతనాన్ని మిగిలిన కప్పలన్నీ చూస్తాయి” అని కప్పల రాజు ఆజ్ఞాపించాడు. పాము తన వీపుపై కప్పల రాజును మోస్తూ తీసుకుని వెళుతుంటే కప్పలన్నీ ఆశ్చర్యంగా చూశాయి. పాము కొద్దిగ దూరం కప్పలను మోసుకుని వెళ్ళి అలసిపోయినట్లు నటించి ఆగిపోయి కప్పలన్నింటినీ తినేసింది.

MORAL :  శత్రువులు తేనెపూసిన కత్తిలా ఎంత తియ్యగా మాట్లాడినా వారిని విశ్వసించరాదు.

నక్క మరియు తాబేలు Telugu stories for Kids PDF

ఒక అడవిలో మర్రిచెట్టు ఉంది, దాని ప్రక్కనే చిన్న చెరువు ఉంది. ఆ ప్రాంతమంతా పచ్చని చెట్లతో, ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంతో చక్కగా ఉంటుంది. చెరువులో ఒక తాబేలు నివసిస్తుంది. అది అప్పుడప్పుడూ ఆ చెట్టు క్రింద చేరి చల్లని గాలికి సేదతీరేది. ఆ సమయంలో మంచినీళ్ళు తాగేందుకు ఒక నక్క ఆ చెరువు వద్దకు వచ్చింది. చెట్టు క్రింద సేదతీరుతున్న తాబేలును నక్క చూసింది. దాన్ని చంపి తినాలని నక్క భావించి తన కాలితో తాబేలు డిప్పపై కొట్టింది. ఎవరో తనకు హాని చేయతలపెట్టారని భావించిన తాబేలు వెంటనే తన తలను డిప్పలోనికి ముడుచుకుంది. తాబేలు ఏ మాత్రం కదలలేదు. నక్క ఎంత ప్రయత్నించినా తాబేలు పైభాగాన ఉన్న డిప్పను కొరకలేకపోయింది. అప్పుడు తాబేలు మాట్లాడుతూ “నక్క! నువ్వు ఎంత ప్రయత్నించినా నన్ను తినలేవు, నా శరీరం చాలా గట్టిది. నన్ను గంటసేపు నీటిలో నానబెడితే నా శరీరం మెత్త బడుతుంది, అప్పుడు నువ్వు సులభంగా తినవచ్చు” అన్నది.

తాబేలు ఉపాయాన్ని అర్థం చేసుకోలేని నక్క చెరువు ఒడ్డున నీటిలో తాబేలును ఉంచి కాలితో పట్టుకుని ఉంది. అలా కొద్దిసేపు ఉంచిన తర్వాత తాబేలును తినే ప్రయత్నం చేసింది, అయినా దాని డిప్ప మెత్త పడలేదు. “ఇంకా నీ శరీరం మెత్తబడలేదేమిటి?” అని నక్క తాబేలును ప్రశ్నించింది. “నక్క! నువ్వు చిన్న పొరపాటు చేశావు. నువ్వు నాపై కాలితో పట్టుకుని ఉన్నావు. అందువల్ల నా శరీరం సరిగ్గా నీటిలో నానలేదు. నీ కాలును తేలికగా నా శరీరంపై ఉంచు, త్వరగా నేను నీటిలో నానిపోతాను” అన్నది తాబేలు. తాబేలు చెప్పినట్లు చేసింది నక్క, తనపై నక్క తేలిక బరువుతో కాలు మోపగానే ఆలస్యం చేయకుండా తాబేలు చెరువులోకి దూకేసింది.

MORAL : నక్క మోసబుద్ధితో తాబేలును తినాలనుకుంది. తాబేలు మోసాన్ని మోసంతోనే జయించి, నక్క నుండి తన ప్రాణాలను కాపాడుకుంది.

తెలివైన నక్క Telugu stories for Kids PDF

ఒక అడవిలో ఒక నక్క నివసిస్తుంది. అది ఒకరోజు అడవిలో తిరుగుతుండగా పడివున్న ఏనుగు కనిపించింది. “ఆహా! ఏమీ నా అదృష్టము. ఏనుగును ఎప్పటినుండో తినాలనేది నా కోరిక, ఆ అవకాశం ఇన్నాళ్ళకు దక్కింది” అని సంతోషంగా మాంసాన్ని తినబోయింది. అయితే ఏనుగు చర్మం చాలా దళసరిగా ఉండటంతో దాన్ని చీల్చే శక్తి నక్క పళ్ళకు లేదు. తన తెలివిని ఉపయోగించి బలమైన క్రూరమృగం చేత చర్మాన్ని చీల్చేలా చేసి, తాను మాంసాన్ని తినాలనేది నక్క కోరిక. ఇంతలో ఆవైపుగా సింహం వచ్చింది. నక్క వినయంగా నమస్కరించి “మృగరాజా! పడివున్న ఈ ఏనుగుకు నేను ఇప్పటి వరకు కాపలా ఉన్నాను. మీరు దీని చర్మాన్ని చీల్చి, మాంసాన్ని తినండి” అని చెప్పింది. “నేను వేటాడిన జంతువునే తింటాను. చచ్చిన జంతువుల మాంసం ముట్టనని నీకు తెలుసుకదా?” అని చెప్పి సింహం అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి అక్కడికి పెద్ద పులి వచ్చింది. నక్క పులితో మాట్లాడుతూ “ఈ ఏనుగును మృగరాజు పడగొట్టి, నన్ను కాపలా పెట్టి స్నానానికి వెళ్ళాడు. “ఒకవేళ పులి ఈ మాంసాన్ని తింటే దాని అంతు తేలుస్తాను’ అని చెప్పి మృగరాజు స్నానానికి వెళ్ళాడు” అన్నది. ఈమాట వినగానే పులికి భయం పట్టుకుంది. ‘ఈ సింహంతో నాకెందుకు శత్రుత్వం’ అనుకుని పులి భయపడి వెళ్ళిపోయింది.

కొద్దిసేపటికి అక్కడికి చిరుతపులి వచ్చింది. నక్క తెలివి ఉపయోగించి చిరుత పులితో ఏనుగు దళసరి చర్మాన్ని చీల్చేలా చేసి మాంసాన్ని తినాలని ఎత్తుగడ వేసింది. నక్క చిరుతతో మాట్లాడుతూ “ఈ ఏనుగును మృగరాజు పడగొట్టి నన్నుకాపలా పెట్టి స్నానానికి వెళ్ళాడు. నువ్వు దీని దళసరి చర్మాన్ని చీల్చు, సింహం వచ్చేలోగా మనం మాంసాన్ని తిందాము” అన్నది నక్క. “సింహంతో నాకు శత్రుత్వం దేనికి, మృగరాజు వస్తే గొడవలౌతాయి. నా దారి నేను పోతాను” అన్నది చిరుత. “చిరుత! నువ్వు భయపడవలసిన పనేమీ లేదు, నువ్వు దీని చర్మాన్ని చీల్చి మాంసాన్ని తింటూ ఉండు. ఒకవేళ సింహం వస్తే నీకు సంకేతాలు ఇస్తాను. అప్పుడు నువ్వు పారిపో” అని నక్క చెప్పింది. నక్క మాటలను నమ్మిన చిరుత తన బలమైన గోళ్ళు, పదునుగా ఉన్న పళ్ళతో చర్మాన్ని చీల్చి మాంసాన్ని బయటకు తీసింది. చిరుత మాంసాన్ని తినబోతుండగా “మృగరాజు వస్తున్నాడు” అని నక్క బిగ్గరగా అరిచింది. ఆ అరుపు విని చిరుతపులి భయపడి పారిపోయింది.

MORAL : ఏనుగు చర్మాన్ని చీల్చే శక్తి లేకపోయినప్పటికీ, నక్క తన తెలివితేటలతో ఇతరులచేత ఆ పని చేయించి, హాయిగా మాంసం తిని తన కోరిక తీర్చుకుంది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *