ఏనుగు మరియు పిచ్చుకల కథ Telugu Stories to Read

Telugu Stories to Read
ఏనుగు మరియు పిచ్చుకల కథ Telugu Stories to Read

ఒక అడవిలో పెద్ద చెట్టుపై ఒక పిచ్చుకల జంట నివాసమేర్పరచుకున్నాయి. ఆడ పిచ్చుక కొన్ని గుడ్లను పెట్టింది. ఇంతలో ఎండ ఎక్కువగా ఉండటంతో సేద తీరేందుకు ఒక ఏనుగు ఆ చెట్టు క్రింద నిలబడింది. ఆ ఏనుగు సేదతీరకుండా, తనంత బలవంతులు లేరన్నట్లు చెట్టును బలంగా రుద్దింది. చెట్టుపైన గూట్లో ఉన్న పిచ్చుక గుడ్లన్నీ కిందపడి పగిలిపోయాయి. పిచ్చుకలకు చావుతప్పి ప్రమాదానికి గురైన పనైంది. గుడ్లన్నీ పగిలి పోవడంతో ఆడపిచ్చుక చాలా ఏడ్చింది. పిచ్చుక ఏడుపు విని ప్రక్క చెట్టుపై నివాసముంటున్న వడ్రంగి పిట్ట వచ్చి విషయం తెలుసుకుంది. “మిత్రమా! ఏడుస్తూ కూర్చుంటే ఒరిగేదేముంది. నీ గ్రుడ్లను పగులకొట్టిన ఏనుగుపై ప్రతీకారం తీర్చుకోవాలి” అన్నది వడ్రంగి పిట్ట.

“కొండంత ఏనుగుపై మేము ఎలా పగతీర్చుకోగలం?” అన్నాయి పిచ్చుకల జంట. “నా స్నేహితురాలు తుమ్మెద వద్దకు వెళదాము. అదేమైనా ఉపాయం చెబుతుందేమో?” అని వడ్రంగి పిట్ట చెప్పింది. అప్పుడు వీళ్ళందరూ కలిసి తుమ్మెద దగ్గరకు వెళ్లారు. “ఏనుగు చాలా బలమైనది. దానిపై ప్రతీకారం తీర్చుకోవడం అంత సులభం కాదు. నా మిత్రుడు కప్ప వద్దకు వెళదాము. అదేమైనా ఉపాయం చెబుతుందేమో” అన్నది తుమ్మెద. అందరూ కలసి కప్ప వద్దకు వెళ్ళారు.

“ఏనుగుపై ప్రతీకారం తీర్చుకోవడం చాలా సులభం” అని కప్ప అందరికీ ఒక ఉపాయం చెప్పింది. కప్ప చెప్పిన ఉపాయాన్ని ఆచరించే పనిలో అందరూ సిద్ధమయ్యారు. ముందుగా తుమ్మెద ఏనుగు కంటి వద్దకు వెళ్ళి కుట్టడానికి ప్రయత్నిస్తుంది. ఏనుగు కళ్ళు మూస్తూ, తెరుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఇంతలో వడ్రంగి పిట్ట వచ్చి ఏనుగు కంటిని పొడిచింది. ఒక కన్ను కనబడక ఏనుగు పరుగులు తీయడం ప్రారంభించింది. తుమ్మెద రెండవ కంటిని కుట్టే ప్రయత్నం చేసింది. ఏనుగు కళ్ళు మూసుకుని పరుగెత్త సాగింది. వడ్రంగి పిట్ట దాన్ని వెంబడించి రెండో కన్నును కూడా పొడిచేసింది. కళ్ళు సరిగా కనబడని ఏనుగు పరుగులు తీయడం ప్రారంభించింది. అక్కడ కొండ అంచున కప్ప కూర్చొని అరవసాగింది. కప్ప అరుపు వినగానే ఏనుగు ఈవైపు చెరువు ఉందని భ్రమపడి పరుగులు తీసింది. ఏనుగుకు కళ్ళు సరిగా కనబడక పోవడంతో అతి వేగంగా పరుగెత్తి, కొండ అంచును దాటి లోయలో పడింది. తప్పు తెలుసుకున్న ఏనుగు, ఇంకెప్పుడు ఇలా చేయకూడదని నిశ్చయించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. 

MORAL : ‘మాకంటే బలవంతులు ఎవరూ లేరు, మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు’ అని భావించరాదు. చిన్న ప్రాణులైనా సరే ఎదురు తిరిగితే ఫలితాలు ఇలానే ఉంటాయి.

తెలివి తక్కువ ఒంటె Telugu Stories to Read

Telugu Stories to Read
తెలివి తక్కువ ఒంటె Telugu Stories to Read

ఒక అడవిలో కాకి, నక్క, పులి చాలా స్నేహంగా ఉండేవి. ఈ మూడు కలసి ఆ అడవికి రాజు సింహం వద్ద సేవకులుగా ఉండేవి. సింహం వేటాడిన జంతువును అన్నీ కలసి తినేవి. అడవి ప్రక్కనున్న ఒక గ్రామంలో ఒంటె ఒకటి ఉండేది. దాని యజమాని సరిగా ఆహారం పెట్టకపోయే సరికి అది సన్నగా అయిపోయింది. యజమానిపై కోపంతో అది అడవిలోకి వెళ్ళింది. అక్కడ పదిరోజులపాటు మంచి పచ్చికను మేసి కండపట్టింది. ఈ తరుణంలో ఆ ఒంటె ఒకరోజు కాకి, నక్కల, పులి కంట పడింది. కండ పట్టిన ఈ ఒంటెను ఎలాగైనా సొంతం చేసుకొని తమ ఆకలిని తీర్చుకోవాలని అవి భావించాయి. మాటా మాటా కలుపుకుని, స్నేహం నటిస్తూ ఒకరి నొకరు పరిచయం చేసుకున్నాయి. మంచి స్నేహితుల్లాగా మారిపోయాయి. “మా అడవికి రాజు మృగరాజు. వారి వద్దకు నిన్ను తీసుకుని వెళ్ళి పరిచయం చేస్తాము” అని సింహం వద్దకు ఒంటెను తీసుకుని వెళ్ళాయి. సింహం కూడా ఒంటె స్నేహాన్ని అంగీకరించింది. సింహం మాట్లాడుతూ “భయపడకు మిత్రమా! నా నుండి నీకు ఎటువంటి ప్రాణహాని లేదు” అని ఒంటెకు అభయమిచ్చింది.

కండ పట్టిన ఒంటెను చూసి కాకి, నక్క, పులి లొట్టలేసేవి. దీని మాంసం చాలా రుచిగా ఉంటుందని చెప్పుకుంటూ అవకాశం కోసం ఎదురు చూడసాగాయి. అవకాశం రాగానే ఒంటెను దక్కించుకొని తమ ఆకలిని తీర్చుకోవాలనేది వాటి ఎత్తుగడ. కాకి, నక్క, పులికి ఉన్నన్ని తెలితేటలు ఒంటెకు లేకపోవడంతో వీటి కుట్రను కనిపెట్టలేకపోయింది. ఒంటె వాటితో స్నేహంగా మెలగసాగింది. “ఒకరోజు ఆహారం వేటకి వెళ్ళిన సింహానికి ఏనుగు ఎదురుపడింది. ఇద్దరి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఏనుగు తన దంతాలతో సింహాన్ని పొడవడంతో అది గాయాలపాలైంది. చేసేదిలేక సింహం తన గుహలో విశ్రాంతి తీసుకోసాగింది. వారం గడిచింది, సింహం వేటాడలేని స్థితిలో ఉంది. ఆహారం లభించకపోవడంతో ఆకలితో సింహం నీరసంగా ఉంది. ఏంచేయాలో తెలియని సింహం తన అనుచరులను పిలిచి ఆహారం తెమ్మని చెప్పింది. “నేను అనారోగ్యంగా ఉండటం వల్ల జంతువులను వేటాడలేక పోతున్నాను. నేను వేటాడితే కొద్దిగ తిని మిగిలిన మాంసాన్ని మీరు తినేవారు. కాబట్టి మీరే ఏదో ఒక జంతువును కనిపెట్టి చెప్పండి. నేను వేటాడిన తర్వాత తిని, మిగిలింది మీకు పెడతాను” అని సింహం దీనంగా అన్నది.

సింహం అనుచరులు తలా ఓ దిక్కుకు వెళ్ళి జంతువుల కోసం వెతికారు. వాటికి ఎక్కడా ఏ జంతువూ కనపడలేదు. ఈ విషయాన్ని తిరిగి వచ్చి సింహంకు చెప్పాయి. ఈలోగా కాకి, నక్క రహస్యంగా మాట్లాడుకున్నాయి. “మిత్రమా కాకి! మనం ఇతర జంతువులకోసం వెదకడం దేనికి. ఈ ఒంటె బాగా కండపట్టి ఉంది. దీన్నే మన సింహం చేత వేటాడిస్తే చాలా రోజులపాటు ఆహారానికి లోటు ఉండదు” అని నక్క అన్నది. ఇద్దరూ కలసి సింహం వద్దకు వెళ్ళి ఒంటెను దక్కించుకునే ప్రణాళిక చెప్పాయి. ఈ మాటలు వినగానే సింహానికి ఎక్కడలేని కోపం వచ్చింది. “నేను ఒంటెను హానికరం చేయనని అభయమిచ్చాను. స్నేహంగా ఉండి ప్రాణాలు తీయడం మంచి పని కాదు” అన్నది సింహం. “మీరు దాడి చేసి హానికరం చేస్తే పాపమౌతుంది, కానీ ఒంటె తనకు తాను మీకు ఆహారమౌతుందంటే హానికరం చేయవచ్చు కదా మృగరాజా!” అన్నది నక్క. “సరే మీ ఇష్టం, ఏదో ఒక ఏర్పాటు చేయండి” అన్నది సింహం.

కాకి, నక్క, పులి కలసి ఒంటె వద్దకు వెళ్ళి “మన మహారాజు ఆకలితో ఉన్నారు. వారు ఆకలితో పడిపోకుండా ఉండాలంటే మన శరీరాన్ని త్యాగం చేయాలి. అందరం కలసి సింహం వద్దకు వెళదాము, పదండి” అని నమ్మబలికి ఒంటెను కూడా మృగరాజు వద్దకు తీసుకుని వెళ్ళాయి. “మహారాజా! మీ ఆహార నిమిత్తం మేము అడవంతా తిరిగాము. ఎక్కడా ఒక్క జంతువు కూడా దొరకలేదు. అవసరమైతే నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి ” అని కాకి దీనంగా చెప్పింది. “ఛీ ఛీ నువ్వు అల్పజీవివి. నీ మాంసాన్ని మన ప్రభువు తింటే సకల పాపాలు చుట్టుకుంటాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పైగా నువ్వు మృగరాజు పంటి క్రిందకు కూడా రావు. నేను ఆహారంగా మారి నా స్వామి భక్తిని చాటుకుంటాను” అన్నది నక్క. వెంటనే కుట్రలో భాగస్వామి అయిన పులి మాట్లాడుతూ “నువ్వు కూడా ఒక అల్పప్రాణివన్న సంగతి మరువకు. మోసానికి ప్రతిరూపం నువ్వు. పైగా నువ్వు కూడా గోళ్ళున్న జంతువువి, కాబట్టి నువ్వు మృగానివే. అందువల్ల నిన్ను మృగరాజు తినకూడదు. మృగరాజు ఆకలి తీర్చడానికి నేను ఆహారంగా మారతాను” అన్నది పులి.

ఇంతమంది సింహానికి ఆహారంగా మారి త్యాగం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారని తెలివి తక్కువ ఒంటె భావించింది. అందరూ కుట్ర చేసి ఒంటెను సింహానికి ఆహారంగా వేయాలనుకుంటున్న విషయాన్ని అర్థం చేసుకోలేక పోయింది. ఒంటె మాట్లాడుతూ “పులిరాజా! నీకు కూడా గోళ్ళు ఉన్నాయి. నువ్వు కూడా మృగానివే. అనేక జంతువులను వేటాడిన నిన్ను మన మృగరాజు తినడం సరికాదు. కాబట్టి మృగరాజా! ఈ ముగ్గురూ మీకు ఆహారంగా పనికిరారు. నేను మీకు ఆహారమవడానికి సిద్ధంగా ఉన్నాను. అందువల్ల నన్ను భుజించి మీ ప్రాణాలను కాపాడుకోండి” అని ఒంటె అర్థించింది. ఒంటె అలా చెప్పగానే సింహంతో పాటు పులి, నక్క అన్నీ కలసి ఒంటెపై పడి తమ ఆకలిని తీర్చుకున్నాయి.

MORAL : ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించి తప్పించుకునే ప్రయత్నం చేయాలి. అమాయకంగా తెలివి తక్కువతనంతో ఆలోచించి మనమేదో త్యాగాలు చేసేద్దాం అనుకుంటే, సమస్యల్లో చిక్కుకుని ప్రాణాలపైకి తెచ్చుకోవలసి వస్తుంది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *